Saturday, 29 July 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞ్ఞానామృతం - 2




పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం అంటూ శ్రీ సాయినాధుని ఉదీని స్మరించుకుని సేవిస్తే ఎన్నొ మహత్యములు కలుగుతాయి. సమర్ధ సద్గురువైన శ్రీ సాయినాదుని దివ్య ఉది చేసే మహిమలు పుంఖాను పుంఖాలుగా సాయి సచ్చరిత్రలో వివరించబడ్దాయి.మరణించిన వారిని సైతం బ్రతికించిన అపూర్వమైన కధనాలు కూడా సచ్చరిత్రలో వివరించబడ్దాయి. భక్తులు ఎదుర్కొనే కష్ట నష్టములు, దుఖములు,అపాయములు,నివారణా సాధ్యం కాని రోగముల్లెంటినో బాబా గారి ఉదీ నయం చేసింది. బాబా యొక్క ఉదీ సంజీవని ఔషధం కంటే మిన్నగా పనిజేస్తుంది. అంతే కాక సృష్టిలో మనకు కనిపించే వస్తువులన్నియూ అనిత్యములని,ఈ శరీరం మరణించిన పిమ్మట కాలి బూడిద అగుననియు, ఒక్క ఆ భగవంతుడు మాత్రమే నిత్యమన్న సత్యం బాబా యొక్క ఊదీ మనకు తెలియజేస్తోంది.ఈ విధంగా బాబా ఊదీ భౌతిగంగానే కాక అధ్యాత్మికంగా కూడా మనపై పనిజేస్తుంది.బాబా ఉదీని సేవించేటప్పుడు మనస్పూర్తిగా బాబాను ప్రార్ధించి కొంత నుదిటిపైనా, మరికొంత మంచి నీటీలో కలిపి సేవిస్తే ఎంతో మంచి ప్రయోజనాలు కలుగుతాయి.అయితే ఏ విశ్వాసం లేకుండా సేవిస్తే మాత్రం ఎటువంటి ప్రయోజనం కలుగదు.సాయి భక్తులకు బాబా యొక్క ఉదీ ఒక వరప్రసాదం. నేటికీ లక్షలాది మంది సాయి భక్తులు అచంచలమైన భక్తితో సాయి యొక్క ఉదీని సేవించి చక్కని ఫలితాలను పొందుతున్నారు.సాయి భక్తులకు సాయి ఊదీ మృత సంజీవని,సాయి పాదాలే శరణ్యం, సాయి నామమే వేద మంత్రాలు.సాయి సచ్చరిత్ర పారాయణమే సర్వ పాపాలకు నిష్కృతి.
 
పిలిస్తే ఠక్కున పలికే దైవం, భక్తులకు, తనను శరణు జొచ్చిన వారిని ఎల్లవేళలా కొలిచే దైవం,నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను, చూడడమే కాదు ఆర్తులు పడే బాధలన్నింటినీ తప్పక తీరుస్తాను అంటూ అభయం ప్రసాదించే కలియుగ దైవం, సమర్ధ సద్గురువు  శ్రీ సాయిని అచంచల భక్తి విశ్వాసాలతో, శ్రద్ధ, సబూరిలతో ఆరాధించడం మన కర్తవ్యం.


Thursday, 27 July 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 1


శిరిడీ సాయి నామం'అపూర్వం, అద్భుతం, అసామాన్యం, అతి శక్తి వంతం. సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. ఆ సాయినాధుని సన్నిధికి సత్వరం చేరుకోగలము. ఇంత వరౌ తెలిసీ, తెలియక మనము చేసిన పాపాలు నిశించి పోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవదం ఒక్కటే చక్కని మార్గం.

ఈ కలియిగంలో సర్వ పాపములు ప్రక్షాళన కావడానికి, భక్తి మార్గంలో పయనించి ఆ సాయినాధునిలో ఇక్యం కావడానికి, నిరంతరం మానవాళిని పట్టి పీడించే అరిషడ్వర్గముల నుండి విముక్తి కావడానికి అతి సులువైన మార్గం నామ జపం. నామ జపం చేస్తే ఇక ఏ యగ్ఙ్య యాగాదులు అవసరం వుండవు. అతి సులభంగా ఆ భగవంతుని దర్శించగలము.

ఎన్నో వేల జన్మలలో అపారమైన పుణ్యం చేసుకొని వుంటే తప్ప సాయి భక్తులం కాలేము. ఆ పరబ్రహ్మ స్వరూపమైన శిరిడీ సాయికి శిష్యులం కాగలిగాము అంటే కొన్ని వేల జన్మలలో మనం చేసుకున్న అదృష్టం అంటే అతిశయోక్తి కాదు.కాని మాయలో పడిపోయిన మనము ఈ విషయాన్ని గ్రహించలేక మామిడి పూత వలె మధ్యలోనె రాలిపోతున్నాం లేక గురువారం భక్తులు గా మిగిలిపోతున్నాం. మనకు ఆ భగవంతుడైన సాయి కేవలం గురువారం మాత్రమే గుర్తుకు రావడం నిజంగా మన దురదృష్టకరం. సాయిని కేవలం కోరికలు తీర్చే యంత్రంగానే విపయోగించుకుంటున్నాం.సాయి భక్తులమైన మనము సాయి నుండి కోరవలసింది భౌతికమైన ఇహికపరమైన కోరికలు కాదు. కోరికలు కలుగని స్థిని ప్రసాదించమని. సాయి జీవితం నుండి తెల్సుకోవల్సింది కరుణ, దయ, ప్రేమ, పరిపూర్ణమైన వైరాగ్యం, పాపభీతి కలిగి వుండడం.

నిరంతరం సాయినే ధ్యానించు. నిరంతరం సాయి నామస్మరణ చెయ్యు. నిరంతరం సాయి తోనే మాట్లాడు, జీవితాన్ని సాయి మయం చేసుకో.

సర్వం శ్రీ శిరిడీ సాయి పాదారవిందార్పణ మస్తు


సర్వే జనా: సుఖినోభవంతు